రేపటి ఆర్డిఓ కార్యాలయం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
కందుకూరు: రైతాంగ సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం తలపెట్టిన కందుకూరు ఆర్డీవో కార్యాలయం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల బిజెపి పార్టీ అధ్యక్షులు నిమ్మ అంజిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ.... ప్రకృతి వైపరీత్యాలతో ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఎకరాకు రూ.15 వేల రైతుబంధు సాయాన్ని సకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు పంటల బీమా సౌకర్యం కల్పించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలోని అన్ని పంటలకు వర్తింపజేయాలని కోరారు.అదేవిధంగా రైతుల పట్టా భూములను 22ఏ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఆర్డీవోకు వినతిపత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు . రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పిన ప్రభుత్వం, కనీసం 12 గంటలు కూడా సరఫరా చేయడం లేదని వారు ఆరోపించారు. రైతులకు నిరంతర విద్యుత్ అందించాలని కోరుతూ విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు రైతులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు.
టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్