రెచ్చిపోయిన కెమికల్ కంపెనీల మాఫియా! *నాగార్జునసాగర్ లో-లెవల్ కాలువలో ప్రమాదకర రసాయన వ్యర్థాల పారబోత
మామూళ్ల మత్తులో చోద్యం చూస్తున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు
మాడ్గులపల్లి, మేజర్ న్యూస్: నల్గొండ జిల్లాలో కెమికల్ కంపెనీల మాఫియా రెచ్చిపోతోంది. ఇంతకాలం హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే వెంట చెరువులు, కుంటల్లో ప్రమాదకర రసాయన వ్యర్థాలను అక్రమంగా పారబోసిన మాఫియా, ఇప్పుడు ఏకంగా నాగార్జునసాగర్ లో-లెవల్ కాలువలోనే వ్యర్థాలను పారబోయడం కలకలం రేపుతోంది.పెద్దవూర మండలం చింతపల్లి సమీపంలో నాగార్జునసాగర్ లో-లెవల్ కాలువలో రసాయన వ్యర్థాలను గుర్తు తెలియని ట్యాంకర్ ద్వారా పారబోసినట్లు స్థానికులు గుర్తించారు. కాలువ నీరు రంగు మారడం, తీవ్ర దుర్వాసన రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కాలువ నీరే పలు గ్రామాల్లో సాగు, తాగునీటికి ఆధారం కావడంతో రైతులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
*పర్యవేక్షణలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వైఫల్యం:*
కంపెనీ నుంచి వ్యర్థ రసాయనాల ట్యాంకర్ బయలుదేరిన దగ్గర నుంచి ట్రీట్మెంట్ ప్లాంట్ వరకు ట్రాకింగ్ చేయాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ ) విధులను విస్మరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మామూళ్ల మత్తులో అధికారులు చోద్యం చూస్తున్నారని, అందుకే ఈ మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
*స్థానిక పోలీసులకు ఫిర్యాదు:*
ఘటనపై ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
*విషపూరిత నీటితో తీవ్ర ముప్పు,మనుషులు, మూగజీవాలకు నష్టం:*
కాలువలో కలిసిన ఈ ప్రమాదకర రసాయన వ్యర్థాల వల్ల కలిగే నష్టం అంతా ఇంతా కాదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.మనుషులపై ప్రభావం:ఈ నీటిని తాగినా, ఈ నీటితో పండిన పంటలు తిన్నా ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, కళ్లు మంటలు, వాంతులు, విరేచనాలు వస్తాయి. దీర్ఘకాలంలో కాలేయం, కిడ్నీలు దెబ్బతిని, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. ఈ కాలువ నీటిని తాగే గ్రామాల్లో భూగర్భ జలాలు కూడా కలుషితమై తాగునీరు విషతుల్యం అయ్యే ప్రమాదం ఉంది.పశువులు, మూగజీవాలపై ప్రభావం:
కాలువలో నీరు తాగిన పశువులు, గొర్రెలు, మేకలు అక్కడికక్కడే మృత్యువాత పడే ప్రమాదం ఉంది. నీటిలోని రసాయనాల వల్ల పశువులకు గర్భస్రావాలు, పాల ఉత్పత్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. కాలువలోని చేపలు, ఇతర జలచరాలు చనిపోయి జీవవైవిధ్యం నాశనం అవుతుంది.పంటలు, భూమిపై ప్రభావం:
ఈ విషపూరిత నీటితో పొలాలకు నీరు పెడితే భూమి సారం దెబ్బతింటుంది. భూమి చౌడు బారి, పంటలు ఎండిపోతాయి. ఆ భూమిలో పండిన ధాన్యం, కూరగాయల్లో రసాయన అవశేషాలు ఉండి, ఆహార గొలుసు ద్వారా మళ్లీ మనుషుల్లోకి చేరుతుంది.
కాలువలో వ్యర్థ రసాయ నాలు పారబోసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, లైసెన్సులు రద్దు చేయాలని రైతులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.