ప్రజావాణి కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి పొన్నం
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః ప్రజల నుంచి వచ్చే ప్రతి ధరఖాస్తును రికార్డు చేయాలని, సమస్య పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షించాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజావాణికి హాజరైన ప్రజల నుంచి వస్తున్న వినతులు, ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారానికి అధికారులు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా రికార్డు చేయాలని, ప్రతి సమస్య పరిష్కారం అయ్యేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని మంత్రి సూచించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వారి సమస్యలను ఓపికగా విని పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. భీమదేవరపల్లి మండలంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ, ఇంకుడు గుంతల నిర్మాణాలు, ఫామ్ పాండ్స్, ఆరుతడి పంటల సాగు, విద్యుత్ సమస్యలు, విద్యా, వైద్య రంగాలకు సంబంధించిన అంశాలపై ఆయా శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. గతంలో మండలంలో గుర్తించిన సమస్యల పరిష్కారం ఎంతవరకు వచ్చిందని, పెండింగ్‌లో ఉన్న సమస్యలేమిటని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఆర్ అండ్ బీ అధికారులను ఆరా తీశారు. ఇప్పటివరకు ఎన్ని ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించారు, ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిలో ఎన్ని పరిష్కరించారు, ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణికి ప్రతి వారం వచ్చే దరఖాస్తుల సంఖ్య, పరిష్కారమైన సమస్యలు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలతో వారంవారీ నివేదిక రూపొందించి అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి నిర్వహించే సమయంలో సంబంధిత అధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, ప్రజలకు అవసరమైన సమాచారం, ఆధారాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రాధాన్యంగా అధికారులు పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.