ఫేక్ అటెండెన్స్‌తో పంచాయతీ కార్యదర్శుల విధులకు డుమ్మా.. కార్యాలయాలకు తాళాలు
చౌడాపూర్, మేజర్ న్యూస్: గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఉద్యోగుల్లో సమయపాలన పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు హాజరు (ఫేస్ రికగ్నిషన్) విధానానికి కొందరు పంచాయతీ కార్యదర్శులు తూట్లు పొడుస్తున్నారనే ఆరోపణలు చౌడాపూర్ మండలంలో కలకలం రేపుతున్నాయి. విధులకు హాజరుకాకుండానే ఫేక్ అటెండెన్స్‌తో వచ్చినట్లు నమోదు చేసుకుంటూ విధులకు దూరంగా ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని కొత్తపల్లి తండా, భజ్య నాయక్ తండా, బొర్ర హేమ్య నాయక్ తండా, గోగ్య నాయక్ తండా తదితర గ్రామపంచాయతీల్లో ఈ పరిస్థితి ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ కార్యాలయాలకు కార్యదర్శులు అందుబాటులో లేకపోవడంతో కొన్ని చోట్ల కార్యాలయాలు తెరుచుకోక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజూ ఉదయం 9 గంటలలోపు తాము విధులు నిర్వహించే గ్రామం నుంచే ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలి. అయితే కొందరు కార్యదర్శులు గ్రామపంచాయతీ కార్యాలయాలకు రాకుండానే హాజరు నమోదు చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం గ్రామపంచాయతీ పేరు, మండలం, జిల్లా వివరాలను కూడా సరిగా మార్చుకోకుండా యాప్‌లో హాజరు నమోదు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిజిటల్ అటెండెన్స్ విధానాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించడం లేదని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్యదర్శులు విధులకు సక్రమంగా హాజరుకాకపోవడంతో ప్రజలకు అవసరమైన జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇంటి పన్నుల చెల్లింపులు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర పరిపాలనా సేవలు ఆలస్యమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు కార్యాలయాలకు రాకపోవడంతో అత్యవసర పనుల కోసం వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని చెబుతున్నారు. ఈ ఆరోపణలపై చౌడాపూర్ మండల ఎంపీఓ శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ, మండలంలోని పంచాయతీ కార్యదర్శులందరి హాజరు ఉదయం 9 గంటలలోపే నమోదైనట్లు తెలిపారు. అయితే యాప్‌లో హాజరు నమోదైనప్పటికీ కార్యదర్శులు వాస్తవంగా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారా లేదా అన్న అంశంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ఫేస్ రికగ్నిషన్ హాజరు వివరాలతో పాటు క్షేత్రస్థాయి హాజరును పరిశీలించాలని, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులైన కార్యదర్శులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
రిపోర్టర్: కోస్గి విజయ్ కుమార్, చౌడపూర్ వికారాబాద్ జిల్లా