నోయిడాలో డేంజర్ బెల్స్: ‘సివియర్’ కేటగిరీలోకి గాలి నాణ్యత
సూర్య బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని పారిశ్రామిక నగరం నోయిడాలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. నగరవ్యాప్తంగా గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించడంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సెక్టార్ 62 మానిటరింగ్ స్టేషన్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఏకంగా 404 పాయింట్లకు చేరుకుని అత్యంత ప్రమాదకరమైన ‘సివియర్’ (తీవ్ర) కేటగిరీలో నమోదైంది.
నగరంలోని ఇతర కీలక ప్రాంతాల్లోనూ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. సెక్టార్ 39లో ఏక్యూఐ 365గా, సెక్టార్ 150లో 343గా రికార్డయి ‘వెరీ పూర్’ విభాగంలో కొనసాగుతున్నాయి. చలి తీవ్రత పెరగడం, గాలుల వేగం మందగించడంతో పాటు దుమ్ము, వాహన ఉద్గారాలు వాతావరణంలో పేరుకుపోవడమే ఈ పరిస్థితికి కారణంగా నిలుస్తోంది. కాలుష్య తీవ్రత దృష్ట్యా చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బయటకు రావద్దని, అత్యవసరమైతే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాలుష్య నియంత్రణకు అధికారులు యంత్రాలతో నీటిని వెదజల్లే చర్యలను ముమ్మరం చేశారు.