భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఎస్పీ రోహిత్ రాజు.
భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
- అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..
- వరద ప్రవాహాలను దాటే సాహసం చేయొద్దు
- లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
కొత్తగూడెం క్రైమ్, సూర్య మేజర్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు. ప్రజల ప్రాణ రక్షణే లక్ష్యంగా పోలీసులు ముందస్తు చర్యలు చేపడుతూ ప్రమాదకర మార్గాల్లో రాకపోకలను నిలిపివేస్తున్నారని పేర్కొన్నారు. భారీ వర్షాల సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఎస్పీ సూచించారు. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో రహదారులను దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా వాహనదారులు వరద నీటిని తక్కువగా అంచనా వేసి ప్రమాదాలకు గురికావద్దని స్పష్టం చేశారు.
*పశువుల కాపరులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి*
పశువుల కాపరులు తమ పశువులను వాగులు, వంకలు, నదుల సమీప ప్రాంతాలకు తీసుకెళ్లవద్దని, ప్రవాహం ఎక్కువగా ఉన్న నీటిని దాటించే ప్రయత్నం చేయకూడదని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.
*విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి*
వర్షాల సమయంలో విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. పిల్లలను చెరువులు, కుంటలు, వాగులు, నీరు నిలిచిన ప్రాంతాల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా చూసుకోవాలని కోరారు. ప్రజల భద్రత కోసం పోలీసులు చేపడుతున్న ముందస్తు చర్యలకు సహకరించాలని, పోలీసుల హెచ్చరికలను, సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.