telangana
మైనింగ్ గుంతల్లో మృత్యుఘోష.. అధికారుల నిర్లక్ష్యానికి నలుగురి బలి
Telangana
04 Nov 2026
165 views
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లాలో మైనింగ్ తవ్వకాలతో ఏర్పడిన గుంతలు మృత్యుకూపాలుగా మారుతున్నాయి. కనీస భద్రతా చర్యలు లేకపోవడం, సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. బంట్వారం, ధారూర్ మండలాల్లో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోవడం జిల్లావ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. మణికంఠ మైన్స్‌లో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి మృత్యువాత పడగా, తరిగోపులలో గొర్రెలను మేపేందుకు వెళ్లిన మరో ఇద్దరు మైనింగ్ గుంతలో పడి ప్రాణాలు కోల్పోయారు. వరుస ప్రమాదాలతో మైనింగ్ యాజమాన్యాల భద్రతా ఏర్పాట్లు, అధికారుల తనిఖీలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.బంట్వారం మండలం బొప్నారం గ్రామ శివారులోని మణికంఠ మైన్స్‌లో నీటితో నిండిన గుంత ఇద్దరు చిన్నారుల పాలిట మృత్యుకూపంగా మారింది. కర్ణాటక రాష్ట్రం కుంచవరం గ్రామానికి చెందిన సురేందర్ (14), అజయ్ కుమార్ (13) ఈతకు వెళ్లి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. చిన్నారుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మైన్స్ యాజమాన్యం ఘటనాస్థలానికి వచ్చి సమాధానం చెప్పాలని, అప్పటివరకు మృతదేహాలను అక్కడి నుంచి తరలించేది లేదని బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.మరోవైపు ధారూర్ మండలం తరిగోపుల గ్రామంలోనూ ఇలాంటి విషాదమే చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సకిల్లా శ్రీనివాస్ (43), మున్నూరు అశోక్ (21) గొర్రెలను మేపేందుకు వెళ్లి మైనింగ్ తవ్వకాలతో ఏర్పడిన గుంతలో పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మైనింగ్ నిర్వాహకులు కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు, మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఒకే జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు మైనింగ్ గుంతలకు బలికావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తవ్వకాలు పూర్తయిన ప్రాంతాల్లో గుంతలను పూడ్చివేయడం లేదా వాటి చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేయడం యాజమాన్యాల బాధ్యత కాదా? ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదా? సంబంధిత మైనింగ్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారా? అన్న ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి జిల్లావ్యాప్తంగా మైనింగ్ ప్రాంతాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని, భద్రతా నిబంధనలు పాటించని యాజమాన్యాలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరో కుటుంబంలో ఇలాంటి విషాదం చోటుచేసుకోకుండా ప్రమాదకరమైన మైనింగ్ గుంతల వద్ద తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ట్యాగ్లు:
Latest News