telangana
పేరుకుపోతున్న చెత్త - డ్రైనేజీ నుంచి దుర్వాసన
సూర్య నస్పూర్ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 26వ డివిజన్ విద్యానగర్, రెడ్డి కాలనీ, గణేష్ నగర్‌లో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా మారింది. గత కొన్ని రోజులుగా చెత్త పేరుకుపోతున్నా మున్సిపల్ సిబ్బంది తొలగించకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దసరా పండుగకు ముందు నుంచి చెత్త సేకరణకు సిబ్బంది రావడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడంతో మురుగునీటి నుంచి తీవ్ర దుర్వాసన వెలువడుతోంది. దీంతో దోమలు, పందుల సంచారం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అపరిశుభ్ర వాతావరణంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు డ్రైనేజీలను శుభ్రం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.