పీఎం రాహత్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి, :- రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందించి, ప్రాణాలను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రాహత్ పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్ నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు ఆసుపత్రి చికిత్స, భరోసాతో కూడిన వైద్య సేవలు అందించే పీఎం రాహత్ పథకం అమలు తీరుపై సమీక్షించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాద బాధితులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య చికిత్సకు దూరం కాకుండా, వారికి తక్షణమే అవసరమైన వైద్య సేవలు అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పీఎం రాహత్ పథకం కింద అర్హులైన రోడ్డు ప్రమాద బాధితులకు ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్ఠంగా ఏడు రోజుల పాటు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స పొందే అవకాశం ఉందని తెలిపారు. పథకం నిబంధనలకు అనుగుణంగా నిర్దేశిత ఆసుపత్రుల్లో చికిత్స అందించాలన్నారు.ప్రమాద బాధితుల వివరాల ధ్రువీకరణ కోసం ఆసుపత్రుల నుంచి వచ్చే అభ్యర్థనలపై పోలీసులు వెంటనే స్పందించి, నిర్ణీత సమయంలో ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. దీనివల్ల బాధితులకు వైద్య సేవలు అందించడంలో జాప్యం నివారించవచ్చన్నారు.పీఎం రాహత్ పథకం కింద ఆసుపత్రులు సమర్పించే చికిత్స ఖర్చుల క్లెయిమ్‌లను జిల్లా కలెక్టర్లు సంబంధిత పోర్టల్ ద్వారా క్రమం తప్పకుండా పరిశీలించాలని, పథకం మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పథకం అమలులో వైద్య, పోలీసు, ఇతర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.సంగారెడ్డి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, అదనపు కలెక్టర్ పాండు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.