పత్తి పంట మాటున గంజాయి సాగు.. రూ.28.46 లక్షల విలువైన గంజాయి స్వాధీనం :
గంజాయి అక్రమ సాగుపై నిర్మల్ పోలీసులు చేపట్టిన గంజాయి గస్తీ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. మామడ మండలం తండ్ర గ్రామ పరిధిలోని ధన్జీనాయక్ తండా శివారులో పత్తి పంట మాటున రెండున్నర ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయిని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో కున్సోత్ రవి (43) అనే రైతును అరెస్టు చేశారు.
పోలీసులు తనిఖీలు నిర్వహించి 204 పచ్చి గంజాయి మొక్కలు, 54 ఎండిన మొక్కలు, 5.320 కిలోల ఎండిన గంజాయి ఆకులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.28.46 లక్షలు ఉంటుందని తెలిపారు. అధిక ఆదాయం పొందాలనే ఉద్దేశంతో పత్తి పంటలో అంతర పంటగా గంజాయి సాగు చేసినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో సోన్ సీఐ బి. గోవర్ధన్ రెడ్డి, మామడ ఎస్సై యు. మహేష్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. గంజాయి అక్రమ సాగు, విక్రయాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.