ఓట్ల తొలగింపును అడ్డుకోవాలి: డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి
సంగారెడ్డి ; ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి కోరారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని తెలిపారు.ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించారంటూ ఆరోపిస్తూ, ఓటరు జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని సూచించారు.బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా చూడాలని కోరారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో కీలకమని, దాని పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి శరణ్ పాటిల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ప్రీతం, అంజయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్,కిరణ్ గౌడ్,వినోద్ పటేల్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.