నీటి సంరక్షణపై కూలీలకు అవగాహన
నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని తిమ్మాయపల్లి, పుట్టోనిపల్లి తండా గ్రామ పంచాయతీల పరిధిలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో జయరాం నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.తిమ్మాయపల్లి గ్రామంలో సాంకేతిక సహాయకుడితో కలిసి నీటి సంరక్షణకు ఉపయోగపడే కందకాలు తవ్వే పనులను పరిశీలించారు.ఈ పనుల్లో 21మంది కూలీలు పాల్గొన్నారు.అనంతరం పుట్టనిపల్లి తండా గ్రామ పంచాయతీ పరిధిలో పంచాయతీ కార్యదర్శి,సాంకేతిక సహాయకుడితో కలిసి కందకాలు తవ్వే పనులను తనిఖీ చేశారు. అక్కడ పనిచేస్తున్న 25మంది కూలీలతో మాట్లాడి ఎల్‌నినో ప్రభావం,భూగర్భ జలాల పరిరక్షణ,నీటి సంరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో జయరాం నాయక్ మాట్లాడుతూ.వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని సూచించారు.నీటి వనరులను సంరక్షించుకోవడం ద్వారా భవిష్యత్తులో నీటి ఎద్దడిని తగ్గించవచ్చన్నారు.ఇందులో భాగంగా జలసిరి పనులను చేపట్టడం జరుగుతోందని తెలిపారు.నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.