నేడుధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఆమనగల్లు రంగారెడ్డి:
ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో పౌరసరఫరాల శాఖ సహకారంతో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభిస్తారని ఆమనగల్లు పిఎసిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాట్లను శుక్రవారం పిఎసిఎస్ సీఈవో పద్మాకర్ రెడ్డి ,డైరెక్టర్లతో కలిసి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చే రైతులకు తగిన ఏర్పాట్లు వసతులు కల్పించాలని మార్కెట్, పిఎసిఎస్ అధికారులు, సిబ్బందికి సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర, సన్న రకాలకు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ పొందాలని కోరారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం సేకరిస్తుందని, దళారులు రైతులను మోసగిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రైతుల కష్టాలు వైదొలిగాయని, వ్యవసాయ రంగం గణనీయమైన అభివృద్ధి సాధించిందని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పిఎసిఎస్ ఆధ్వర్యంలో రైతులకు పంట రుణాలు ,ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ కాలే మల్లయ్య, మార్కెట్ డైరెక్టర్ వస్పుల శ్రీశైలం, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, మాజీ ఎంపీటీసీ గురిగల్ల లక్ష్మయ్య , యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వసుపుల శ్రీకాంత్, నాయకులు గొడుగు వెంకటేష్, మహేష్, కండె భాస్కర్ ,మార్కెట్ సూపర్వైజర్ రాజేశ్వరి, పిఎసిఎస్ సిబ్బంది అల్లాజీ, దేవేందర్, సురేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.