క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ళు
హైదరాబాద్:హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో మొత్తం లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఈ ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలను మూడు విడతల్లో పూర్తి చేస్తున్నామని తెలిపారు. సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లతో ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పురోగతిపై శుక్రవారం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.
పేద ప్రజల ఉపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా, వారు పనిచేసే ప్రాంతాలకు నివాస సమయాల్లో అందుబాటులో ఉండేలా సమీపంలోనే ఈ ఇళ్లను నిర్మిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం టవర్ల నిర్మాణాలకు అవసరమైన భూముల గుర్తింపును వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి సుమారు 500 ఇళ్ల చొప్పున నిర్మిస్తుండగా, రెండు మరియు మూడో విడతల నిర్మాణాలకు ముందస్తుగానే స్థలాలను సేకరిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికను అత్యంత పారదర్శకంగా ఆధునిక సాఫ్ట్‌వేర్ ద్వారా నిర్వహించే ఆన్‌లైన్ డ్రా పద్ధతిలో చేపడుతున్నామని, దీనికి సంబంధించి ప్రత్యక్ష ప్రసారం (లైవ్) కూడా అందుబాటులో ఉంచుతామని వివరించారు. ప్రజా పారదర్శకత కోసం ఈ ఎంపిక వివరాలను యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ నిర్మాణాల ప్రక్రియలో ప్రభుత్వ భూముల రక్షణకు అధికారులు అత్యంత ప్రాధాన్యమివ్వాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.