కీసర అంబేద్కర్ చౌరస్తాలో సీసీ కెమెరాలు అలంకారప్రాయమేనా? నిఘా ఎక్కడ?
కీసర, మేజర్ న్యూస్: కీసర మండలంలోని ప్రధాన కూడలిగా ఉన్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చౌరస్తాలో సీసీ కెమెరాల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల భద్రతకు కీలకమైన ఈ కూడలిలో నాలుగు వైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ అవి సక్రమంగా పనిచేస్తున్నాయా? అన్ని దిశల్లో స్పష్టమైన దృశ్యాలు రికార్డు అవుతున్నాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కెమెరాలు ఏర్పాటు చేయడమే తప్ప వాటి పనితీరుపై నిరంతర పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే సీసీ కెమెరాల ఫుటేజీ కోసం అధికారులు వాటిని పరిశీలిస్తున్నారా? ముందస్తుగా కెమెరాల పనితీరును తనిఖీ చేయాల్సిన బాధ్యత లేదా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కెమెరాలు పనిచేయకపోతే ప్రమాదాలు జరిగిన సమయంలో ఆధారాలు సేకరించడం ఎలా సాధ్యమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రధాన రహదారులకు అనుసంధానంగా ఉన్న అంబేద్కర్ చౌరస్తాలో నిత్యం వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలు, ఇతర అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకునే అవకాశాలు ఉండటంతో నిరంతర నిఘా అవసరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గతంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మద్యం మత్తులో జరిగిన దుర్ఘటనను గుర్తుచేస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.సీసీ కెమెరాలు కేవలం ప్రమాదాలు జరిగిన తర్వాత ఆధారాలు సేకరించడానికి మాత్రమే కాకుండా నేరాల నియంత్రణకు, అసాంఘిక కార్యకలాపాల నివారణకు, ప్రజల్లో భద్రతాభావం కల్పించడానికి ఉపయోగపడాలి. అందుకే కెమెరాల ఏర్పాటు ఎంత ముఖ్యమో వాటి నిరంతర నిర్వహణ, పనితీరుపై పర్యవేక్షణ కూడా అంతే ముఖ్యమని స్థానికులు పేర్కొంటున్నారు.సంబంధిత పోలీసు అధికారులు తక్షణమే అంబేద్కర్ చౌరస్తాలోని సీసీ కెమెరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనిచేయని కెమెరాలకు మరమ్మతులు చేపట్టి, నాలుగు వైపులా స్పష్టమైన నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని కీసర ప్రజలు, కీసర మండల అంబేద్కర్ సంఘం కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ప్రజల భద్రతకు మేలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.