కౌంటర్ ర్యాలీలతో కాంగ్రెస్ పోరాటాన్ని అడ్డుకోలేరుః టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధి: రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ‘సంవిధాన్ రక్షక్ మార్చ్’కు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనను చూసి ఓర్వలేక బీజేపీ కౌంటర్ ర్యాలీలు నిర్వహిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీజేపీ ఎన్ని కౌంటర్ ర్యాలీలు నిర్వహించినా దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ పాలనలో దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయని ఆయన ఆరోపించారు. సీబీఐ, ఈడీతో పాటు ఎన్నికల కమిషన్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం తన జేబు సంస్థలుగా మార్చుకుందని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్‌ను అడ్డం పెట్టుకుని ఓటర్ల జాబితా నుంచి అర్హులైన పేదలు, అమాయక ప్రజల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. అక్రమ ఓట్ల తొలగింపు ఆరోపణలపై సుప్రీంకోర్టు సైతం తప్పుపట్టడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. త్యాగాల చరిత్ర కలిగిన నెహ్రూ, గాంధీ కుటుంబాల గురించి మాట్లాడే నైతిక హక్కు సంఘ్ పరివార్‌కు లేదని అన్నారు.
గత 13 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వమే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని విమర్శించారు. రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య వ్యవస్థలను, పేద ప్రజల ఓటు హక్కును పరిరక్షించేందుకే కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.