సూర్య కరీంనగర్ ప్రతినిధి కరీంనగర్ జిల్లాను డ్రగ్స్, గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వాటి సరఫరా, విక్రయాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, డీఆర్వో స్వామి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో నమోదైన కేసులు, తనిఖీలు, మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.
విద్యాసంస్థలు, మెడికల్ షాపులు, బస్టాండ్ల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అనుమానాస్పద కార్యకలాపాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు వివరించారు.
చాక్లెట్ల రూపంలో గంజాయి విక్రయాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఇటీవల కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద 168 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ స్క్వాడ్ ఇన్‌స్పెక్టర్ దుర్గాభవాని సమావేశంలో వివరించారు. ఇలాంటి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
మత్తు పదార్థాలకు బానిసైన వారికి అవసరమైన వైద్య చికిత్స, కౌన్సెలింగ్ అందించి సాధారణ జీవనంలోకి తిరిగి వచ్చేలా సహకరించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. డ్రగ్స్ రహిత కరీంనగర్ లక్ష్య సాధనకు పోలీసు, ఎక్సైజ్, విద్యా, వైద్య ఆరోగ్యశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు