జన్నారంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
సూర్య, జన్నారం : జన్నారం మండలంలో మంగళవారం పవిత్రమైన కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ప్రజలు సమీపంలో ఉన్న గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు ఆచరించారు. ప్రజలందరూ సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యంతో తులతూ గాలని కోరారు. కార్తీకదీపం వెలిగితే ఇంట్లోనే కాదు మనసుల్లోనూ చీకట్లు తొలగిపోయి, శివనామ స్మరణలో జీవితమంతా ఆధ్యాత్మిక వెలుగులు నింపాలని ఆలయాల్లో పూజలు చేశారు. ప్రతి గ్రామంలో ఉన్న ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మురిమడుగులోని సత్యనారాయణ స్వామి ఆలయంలో గ్రామంలోని మహిళలంతా కలిసి సామూహికంగా దీపాలతో దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రేండ్లగూడలోని రామాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ళ ముందు దీపాలు వెలిగించుకొని వేడుకలను జరుపుకున్నారు.