నిర్మాత డబ్బులు ఎగ్గొడితే టేప్ రికార్డర్ పట్టుకెళ్లా.. అక్షయ్ కుమార్ ఆసక్తికర కథ!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, పారితోషికం కోసం చేసిన పోరాటాలను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గుర్తుచేసుకున్నారు. ప్రముఖ టాక్ షో కాఫీ విత్ కరణ్‌లో నటుడు రవి కిషన్‌తో కలిసి పాల్గొన్న అక్షయ్, ఓ నిర్మాత తనకు ఇవ్వాల్సిన సుమారు 68 వేల రూపాయల బకాయి చెల్లించకపోవడంతో అతని ఇంట్లోని టేప్ రికార్డర్‌ను తీసుకువెళ్లి విక్రయించిన ఆసక్తికర ఘటనను పంచుకున్నారు. అప్పట్లో తనకు ఆ మొత్తం చాలా పెద్దదని, డబ్బులు రాకపోవడంతో ముంబయిలోని మహిమ్‌లో ఉన్న ఆ నిర్మాత ఇంటికి స్వయంగా వెళ్లి నిలదీశానని అక్షయ్ వివరించారు.
నిర్మాత తలుపు తీయగానే తనకు డబ్బులు వసూలు చేయడానికి వచ్చానని అర్థమైందని, సినిమా ఫ్లాప్ అయిందని సాకులు చెబుతూ డబ్బులు ఇవ్వలేదని అక్షయ్ తెలిపారు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తాను హాల్‌లో ఉన్న టేప్ రికార్డర్‌ను ఊడదీసి వెంట తీసుకెళ్లానని, అయినా ఆ నిర్మాత తనను అడ్డుకోలేదని చెప్పారు. ఆ టేప్ రికార్డర్‌ను హీరా పన్నా వద్ద 32 వేల రూపాయలకు విక్రయించానని, మిగిలిన బకాయిని ఆ నిర్మాత ఇప్పటివరకు తిరిగి చెల్లించలేదని అక్షయ్ సరదాగా వ్యాఖ్యానించారు.
ఇదే షోలో నటుడు రవి కిషన్ కూడా తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న పరిస్థితులను వెల్లడించారు. ఉధార్ కీ జిందగీ చిత్రంలో చిన్న పాత్ర చేసినప్పుడు లక్ష రూపాయలకు పైగా పారితోషికం రావాల్సి ఉందని, అయితే డబ్బింగ్ పూర్తయ్యాక పూర్తి డబ్బు తీసుకోవాలా లేక సినిమాలో తన సీన్లు ఉంచుకోవాలా అనే పరిస్థితి ఎదురైందని చెప్పారు. తమ ఊరిలో భూమి తాకట్టులో ఉండి డబ్బు అవసరమైనప్పటికీ, సినిమాలో తన పాత్ర నిలబడటమే ముఖ్యమని భావించి పారితోషికాన్ని వదులుకున్నట్లు రవి కిషన్ తెలిపారు.
ఇక సినిమాల విషయానికొస్తే, అక్షయ్ కుమార్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల భూత్ బంగ్లా, వెల్కమ్ టు ద జంగిల్, హైవాన్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, రాబోయే రోజుల్లో గోల్‌మాల్ 5, మౌజా హీ మౌజా, సముక్ వంటి చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read: ఇటాలియా టీ10 లీగ్‌లో విజయ్ శంకర్ జోరు.. వరుసగా రెండో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు!