హక్కుల సాధనకు బాధ్యతే పునాది : హెచ్ఎం ఢీ.శేఖర్
కృష్ణ సూర్య న్యూస్ :
భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ఎలా పోరాడతామో, రాజ్యాంగం నిర్దేశించిన విధులు, బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ అంతే సమర్థవంతంగా, నిబద్ధతతో నిర్వర్తించాలని ప్రధానోపాధ్యాయులు దండు శేఖర్ పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మండలంలోని ముడుమాల్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు దండు శేఖర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఈ వేడుకల్లో భాగంగా ఉదయం ప్రార్థనా సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ కలిసి భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా పఠించి రాజ్యాంగ విలువలపై అవగాహన పెంచుకున్నారు. అనంతరం గ్రామంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ హక్కులతో పాటు బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించినప్పుడే విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదిగి దేశాభివృద్ధికి సేవ చేయగలరని సూచించారు. మనం మన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించినప్పుడు సమాజంలో గౌరవం, అభినందనలు, ప్రశంసలు లభిస్తాయని,మన ప్రవర్తన పట్ల సమాజం గర్వపడుతుందన్నారు.
మనం ఎక్కడ , ఏ స్థాయిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మన బాధ్యతలను గుర్తించి విధులను నిర్వర్తించాలని, అప్పుడే హక్కులకు తగిన గౌరవం లభిస్తుందని,రాజ్యాంగ దినోత్సవంలో విధుల ఆవశ్యకతను పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు భారతి, ఆస్మా నిషాత్, అశోక్, పద్మావతమ్మ, మహేశ్వరి, నిజగుణశివయోగి , విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
నర్సిములు, సూర్య రిపోర్టర్ కృష్ణ మండలం