ఘర్షణలో ఒకరి మృతి
సూర్య రెంజల్ : మండల కేంద్రంలో ఇరువురి కుటుంబాల మధ్య ఘర్షణ జరిగిన సమయంలో ఒకరిని తోయడంతో పడి అక్కడికక్కడే మృతి జరిగిన సంఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే రెంజల్ గ్రామానికి చెందిన సంజీవ్ మరియు భోజన్న నీటి కులాయి వద్ద ఘర్షణకు దిగడంతో దాడి చేసుకోవడంతో భోజన్నకు గాయాలు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా, ఆయన కుటుంబీకుడైన పాల గంగాధర్ (50) సంవత్సరాలు వచ్చి సంజీవ్ తో గొడవ పడుతున్న సమయంలో గంగాధర్ ను సంజీవ్ కుటుంబీకులు తోయడంతోనే క్రిందపడి తలకు గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనను తెలుసుకున్న కుటుంబీకులు మృతదేహాన్ని సంజీవ్ ఇంటి ముందర వేసి ఆందోళనను చేపట్టారు. విషయం తెలుసుకున్న బోధన్ రూరల్ సిఐ విజయబాబు, రెంజల్ ఎస్సై గంగాధర్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. సంజీవ్ కుటుంబీకులు అశోక్, మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తులు మృతిని కుటుంబీకులను సముదాయించడంతో, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.