ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదు:బషీరాబాద్ సొసైటీ మాజీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్
బషీరాబాద్, మేజర్ న్యూస్: తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి కృషి చేస్తున్నారని, ఆయనపై అసత్య ప్రచారాలు చేస్తూ గ్రూపు రాజకీయాలకు పాల్పడే వారిని సహించేది లేదని బషీరాబాద్ సొసైటీ మాజీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ హెచ్చరించారు. శనివారం బషీరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం, పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించడం మానుకోవాలని హితవు పలికారు. నాయకులకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా ఎమ్మెల్యేను కలిసి పరిష్కరించుకోవాలే తప్ప, రహస్య సమావేశాలు, వర్గపోరుతో పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయవద్దన్నారు. బషీరాబాద్ మండలంలో సుమారు రూ.400 కోట్లతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రూ.12 కోట్లతో నూతన పాఠశాల భవనం, ఆధునిక ఆసుపత్రి, జూనియర్ కళాశాల ఏర్పాటు, బషీరాబాద్ నుంచి లక్ష్మీనారాయణపూర్, కరణ్‌కోట్, మైలవరం వరకు రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు. ఇంతటి అభివృద్ధి జరుగుతున్నప్పటికీ కొందరు వ్యక్తిగత స్వార్థంతో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలోనూ ఇలాంటి పరిణామాలతో పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యాయని, ఇప్పుడు అలాంటి పరిస్థితులకు తావివ్వకూడదన్నారు. పార్టీ అధిష్ఠానం, ఎమ్మెల్యే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో తాండూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మనోహర్‌రెడ్డే పోటీ చేస్తారని, ఆయన విజయానికి తామంతా కృషి చేస్తామని అజయ్ ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
రిపోర్టర్: కాశీం పాషా, బషీరాబాద్, వికారాబాద్ జిల్లా.