ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మండల స్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటు
సూర్య జైపూర్ : ఎల్ నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జైపూర్ మండల స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు.సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీపతి బాపురావు అధ్యక్షతన కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామాల్లో ఉపాధి హామీ పనుల ద్వారా కూలీలకు ఉపాధి కల్పించడం, పశుగ్రాసం పెంపకం, పశువులకు తాగునీటి సదుపాయం, తాగునీటి కొరత నివారణకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే చెరువుల పునరుద్ధరణ, ఫామ్ పాండ్లు, బోరుబావుల రీఛార్జ్, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, వర్షపు నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, కల్వర్టులు, అంగన్‌వాడీ భవనాలు, పశువులు, గొర్రెలు, మేకల షెడ్ల నిర్మాణం వంటి పనులను వివిధ శాఖల సమన్వయంతో చేపట్టాలని తెలిపారు. గ్రామస్థాయిలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి పనుల పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు. కమిటీ వారానికి ఒకసారి సమావేశమై పనులపై సమీక్ష నిర్వహించి నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపించనున్నారు.ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ వనజారెడ్డి, ఏఈఈ గ్రిడ్ జె.వినయ్ కుమార్, ఏఈ పంచాయతీరాజ్ బి.రాజ్ కుమార్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఏ.వెంకటేష్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజమల్లయ్య, ఏపీవో బాలయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.