ఈనెల 15న మెగా జాబ్ మేళా
మంచాల మేజర్ న్యూస్ : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మల్‌రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో ఈనెల 15న ఇబ్రహీంపట్నంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆరుట్ల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బుడిగల పరమేష్ తెలిపారు. బుధవారం ఆరుట్లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరానికి చేరువలో ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పలు ఐటీ కంపెనీలతో పాటు వివిధ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని పేర్కొన్నారు. స్థానిక యువతకు ఆయా సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కంపెనీల ప్రతినిధులతో చర్చించి జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీతో పాటు ఉన్నత విద్యార్హతలు కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికెట్లతో ఈనెల 15న ఉదయం 10 గంటలలోపు ఇబ్రహీంపట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజాభవన్‌కు చేరుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రావుల నాగరాజు, పంబాల కిషోర్, ఆమంచ జగన్, ఆడెపు మధు, దూసరి రాజు, ఆరుట్ల ఇందిరమ్మ కమిటీ సభ్యులు కంబాలపల్లి బుగ్గరాములు తదితరులు పాల్గొన్నారు.
✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల, రంగారెడ్డి జిల్లా