telangana
ఈ-వేస్ట్ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన - నాలుగు రంగుల వ్యర్థాల సేకరణ డబ్బాల ఏర్పాటు
సూర్య జైనూర్ : ఈ-వేస్ట్ సేకరణ ప్రత్యేక దినోత్సవాన్ని పురస్కరించుకొని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని ఎంపీపీఎస్ సిర్పూర్ (యు) పాఠశాలలో బుధవారం వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నాలుగు రంగుల వ్యర్థాల సేకరణ డబ్బాలను ఏర్పాటు చేసి, వాటి వినియోగం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆత్రం దత్తు మాట్లాడుతూ, పరిశుభ్రమైన పాఠశాల, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. విద్యార్థులు చిన్న వయస్సు నుంచే వ్యర్థాలను వాటి స్వభావాన్ని బట్టి వేరు చేయడం, నిర్ణీత డబ్బాల్లో సేకరించడం, పర్యావరణానికి హాని కలగకుండా బాధ్యతాయుతంగా పారవేయడం వంటి మంచి అలవాట్లను అలవరచుకోవాలని సూచించారు.తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు, ప్రమాదకర వ్యర్థాలు, ఈ-వ్యర్థాలను సరైన విధంగా వేరు చేయడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని వివరించారు. పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులను సాధారణ చెత్తలో వేయకుండా ప్రత్యేకంగా సేకరించి, తగిన విధంగా రీసైక్లింగ్‌కు పంపించాలని తెలిపారు. విద్యార్థులు పాఠశాలలో నేర్చుకున్న పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ పద్ధతులను తమ ఇళ్లలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ పాటిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు చవాన్ స్వప్న, షాహీనాస్ , ఆత్రం గాయత్రీ మండల క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ( సి ఆర్ పి), ఆత్రం హనుమంతరావు, బానోత్ విట్టల్,విద్యార్థులు పాల్గొన్నారు.