టెలివిజన్ తెరపై మొదటిసారిగా మీరా రాజ్‌పుత్ సందడి.. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో షాహిద్ కపూర్, ఈశాన్ ఖట్టర్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సతీమణి మీరా రాజ్‌పుత్ తొలిసారిగా టెలివిజన్ తెరపై కనిపించడానికి సిద్ధమయ్యారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ టాక్ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ఐదవ సీజన్‌కు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఆమె సందడి చేయనున్నారు. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లో షాహిద్ కపూర్తో పాటు ఆయన తమ్ముడు, యువ నటుడు ఈశాన్ ఖట్టర్ కూడా అతిథులుగా హాజరయ్యారు. కుటుంబ సమేతంగా పాల్గొన్న ఈ షోకి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
షోలో భాగంగా హోస్ట్ కపిల్ శర్మ మాట్లాడుతూ, టెలివిజన్ షోలో మీరా రాజ్‌పుత్ కనిపించడం ఇదే తొలిసారమని పేర్కొనగా, ఆమె దానికి సానుకూలంగా స్పందించారు. ఈ సరదా సంభాషణలో షాహిద్ కపూర్ తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన సినిమా ఉడ్తా పంజాబ్ ఎడిటింగ్ సమయంలో జరిగిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ, సినిమా చూశాక మీరా తన పక్కన కూర్చోకుండా సోఫాలో దూరంగా వెళ్లి కూర్చున్నారంటూ చమత్కరించారు. దీనికి కపిల్ శర్మ స్పందిస్తూ కబీర్ సింగ్ సినిమా చూశాక ఆమె పెళ్లికి అంగీకరించారంటూ సరదాగా నవ్వులు పూయించారు.
ఇదే వేదికపై షాహిద్ కపూర్ తన చిన్ననాటి జ్ఞాపకాలను, తమ్ముడు ఈశాన్ ఖట్టర్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. చిన్నతనంలో తాను ఈశాన్ డైపర్లు మార్చానని షాహిద్ సరదాగా చెప్పగా, వృద్ధాప్యంలో తాను షాహిద్ సేవలు చేస్తానని ఈశాన్ బదులివ్వడం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. అంతేకాకుండా పిల్లల పెంపకం గురించి అర్చన పూరన్ సింగ్ అడిగిన ప్రశ్నకు మీరా బదులిస్తూ, షాహిద్ పిల్లలను అమితంగా ఇష్టపడతారని, అయితే కాస్త ఎక్కువగా గారబం చేస్తారని తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ పూర్తి వినోదాన్ని పంచుతుందని మేకర్స్ వెల్లడించారు.