దుద్దెడ మాజీ సర్పంచ్ కొంక వెంకటేశం మృతి పట్ల సంతాపం
కొండపాక : కొండపాక మండలం దుద్దెడ గ్రామ మాజీ సర్పంచ్ కొంక వెంకటేశం ( 71 ) సోమవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల గ్రామస్తులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొంక వెంకటేశం మృతికి సంతాప సూచకంగా, ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు బంద్ (బైకాట్) పాటించాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. 2002 నుండి 2007 వరకు ఐదు సంవత్సరాల పాటు దుద్దెడ గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన వెంకటేశం, తన పదవీ కాలంలో గ్రామానికి ఎనలేని సేవలు అందించి ప్రజల మన్ననలు పొందారు. ముఖ్యంగా గ్రామంలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించడంలో, మౌలిక వసతుల కల్పనలో ఆయన చేసిన కృషి మరువలేనిదని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. నేత కార్మిక కుటుంబం నుండి వచ్చి, ప్రజా సేవలో తనదైన ముద్ర వేసిన వెంకటేశం మరణం గ్రామానికి తీరని లోటని చేనేత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు వడ్లకొండ శ్రీనివాస్, మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షుడు బొజ్జ నరేందర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోనే శ్రీనివాస్, బొజ్జ మహదేవ్, బింగి వేణు, పంతం వెంకటేశం, నరేందర్, షాదుల్ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అంతిమయాత్రలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నేత కార్మికులు, యువకులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.