దివ్యాంగుల వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ
రంగారెడ్డి : జిల్లాలోని ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహాల నిర్వహణ, విద్యార్థుల సంక్షేమం, ప్రభుత్వ పథకాల అమలుపై ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి శాంతి శ్రీ తెలిపారు. జిల్లాలోని వివిధ సంస్థలు, వసతి గృహాల్లో రెండు వేలకు పైగా దివ్యాంగులు విద్య, వసతి సదుపాయాలు పొందుతున్నారని వెల్లడించారు.
పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు దివ్యాంగుల శాఖ పర్యవేక్షణ బాధ్యతలను హైదరాబాద్ ఏడీకి అప్పగించినట్లు పేర్కొన్నారు. ఆయన జిల్లాలోని ఆరు ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహాలను సందర్శిస్తూ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
అదేవిధంగా జిల్లా సంక్షేమ అధికారి కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు వివరించారు. ఈ నెల 10న చంపాపేటతో పాటు ఇతర ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహాలను సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న వసతి, భోజనం, పారిశుద్ధ్యం, రికార్డుల నిర్వహణ, వార్డెన్ల విధులను పరిశీలించి తగిన సూచనలు జారీ చేసినట్లు తెలిపారు.
జిల్లాలోని ఆరు ప్రభుత్వ హోమ్స్ ప్రస్తుతం ప్రైవేటు భవనాల్లో అద్దె ప్రాతిపదికన కొనసాగుతున్నాయని, దివ్యాంగులకు అనుకూలమైన భవనాల కోసం పలుమార్లు పత్రికా ప్రకటనలు ఇచ్చినా యజమానులు అద్దెకు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదన్నారు. అయినప్పటికీ అందుబాటులో ఉన్న వనరులతో హోమ్స్ నిర్వహణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు ప్రతిరోజూ భోజనం అందించాలని వార్డెన్లను ఆదేశించినట్లు తెలిపారు. ఆహార నాణ్యత, పోషకాహారం, పరిశుభ్రతపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతి, వైద్య సదుపాయాలు, భద్రత కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
అర్హులైన దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డు, ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీమ్ (ERS), ఆర్థిక సహాయం, ట్రాన్స్‌జెండర్ గుర్తింపు ధ్రువపత్రాల ద్వారా ప్రభుత్వ ప్రయోజనాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహాల్లోనూ ముఖ గుర్తింపు ఆధారిత హాజరు నమోదు వ్యవస్థ (FRAS) అమలుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. హాజరు పట్టికలు, రిజిస్టర్లు, ఇతర రికార్డులను సక్రమంగా నిర్వహించి నిర్ణీత సమయంలో జిల్లా కార్యాలయానికి సమర్పించాలని వార్డెన్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
వసతి గృహాల నిర్వహణపై వార్డెన్లతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, కొన్ని భవనాల లభ్యత, పరిపాలనాపరమైన సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ సేవలు కొనసాగిస్తున్నామని జిల్లా సంక్షేమ అధికారి స్పష్టం చేశారు. జిల్లా సంక్షేమ శాఖలో అవినీతికి ఏమాత్రం తావులేకుండా పూర్తి పారదర్శకతతో పరిపాలన కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
వడ్ల శ్రీనివాస చారి : రంగారెడ్డి - మేజర్ న్యూస్