కొనుగోలు కేంద్రాలున్నా.. కొనే నాథుడేడీ?
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం.. రైతులకు తప్పని తిప్పలు భాజపా మండల ప్రధాన కార్యదర్శి బర్మ నాగరాణి ఆగ్రహం
చౌటుప్పల్, మేజర్ న్యూస్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని భాజపా మండల కమిటీ ప్రధాన కార్యదర్శి బర్మ నాగరాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యం సేకరించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు.
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ధాన్యం తేమ శాతం, ఇతర నిబంధనల పేరుతో కొనుగోళ్లలో జాప్యం చేయడం వల్ల రైతులు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు వాతావరణ మార్పులు, అకాల వర్షాల భయం రైతులను వెంటాడుతోందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వ ఉండటంతో తడిసిపోతుందేమోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడం బాధాకరమన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచి, ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని, రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా కొనుగోలు చేయించాలని కోరారు. అన్నదాతలను రోజుల తరబడి నిరీక్షించేలా చేయకుండా వారికి న్యాయం చేయాలని బర్మ నాగరాణి డిమాండ్ చేశారు.