ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఎందుకు?
వెంటనే కొనుగోళ్లు చేపట్టాలి: సర్పంచ్ నందగిరి వెంకటేష్ గౌడ్
చౌటుప్పల్, మేజర్ న్యూస్: మండలంలోని గుండ్లబావి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ నందగిరి వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఎందుకు జరుగుతోందని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యంతో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి రావడం సరికాదన్నారు. అకాల వర్షాలు, ఇతర ఇబ్బందులతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.