భిన్నత్వంలో ఏకత్వమే పటాన్‌చెరు ప్రత్యేకత
పటాన్‌చెరు;భిన్నత్వంలో ఏకత్వం.. మతాలు, భాషలు, ప్రాంతాలు వేరైనా అందరూ కలిసిమెలిసి జీవించే పటాన్‌చెరు సంస్కృతికి ఛట్ పూజ వేడుకలు మరో నిదర్శనంగా నిలిచాయి. ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజను పురస్కరించుకొని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 50 వేల మంది ఉత్తర భారతీయులకు 10 లారీల చెరుకును పంపిణీ చేశారు. శుక్రవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉత్తర భారతీయులకు తన సొంత నిధులతో కొనుగోలు చేసిన చెరుకును అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉపాధి అవకాశాల కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది పటాన్‌చెరు నియోజకవర్గానికి వచ్చి ఇక్కడి పరిశ్రమల్లో పనిచేస్తూ కుటుంబాలతో కలిసి నివసిస్తున్నారని తెలిపారు. స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులోనూ అందరికీ తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నామని పేర్కొన్నారు.గత 20 సంవత్సరాలుగా పటాన్‌చెరులోని సాకి చెరువు కట్టపై నిర్వహిస్తున్న ఛట్ పూజ వేడుకలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగల నిర్వహణలో భాగస్వాములవుతున్నామని చెప్పారు.పటాన్‌చెరు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల ప్రజలు సోదరభావంతో, ఐకమత్యంతో జీవించడం ప్రత్యేకత అని, భవిష్యత్తులోనూ ఉత్తర భారతీయుల సంక్షేమానికి తన సహకారం కొనసాగుతుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, వెంకటేష్,ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.