BREAKING
ఉత్తమ చిత్రంగా 'వన్ లాస్ట్ స్టాప్' ఎంపిక ట్రాన్స్‌ఫార్మర్‌ పిల్లర్ నిర్మాణాన్ని తొలగించాలి - మున్సిపల్ కమిషనర్‌కు ముస్లిం కమిటీ వినతి హిందూ మహాసముద్రం దేశాలను కలపాలి కానీ విడదీయకూడదు వ్యవసాయ భూమిలో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు మౌలిక సదుపాయాల రంగానికి కేంద్రం భారీ ఊతం.. కె. పెదపూడి గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి రాయపరెడ్డి సత్యనారాయణ విస్తృత పర్యటన సూర్యనారాయణుడికి వెండి కిరీటం బహుకరణ బాల్య వివాహాలు బాలికల విద్యకు దూరం ఏఆర్‌ఎస్‌ఐ కుటుంబానికి రూ.1.82 లక్షల సాయo విదేశీ నిధుల రాక, ముడి చమురు తగ్గుదలతో సెన్సెక్స్ 1,502 పాయింట్లు జంప్ మహిళా సాధికారతే వికసిత భారత్‌కు బాట: డిసెంబర్ 23 వరకు విస్తృత కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ పరీక్షలు పద్మశాలి ఎమ్మెల్సీ సిరిసిల్ల మహిళకు ఇవ్వాలి - టీపీసీసీ అధ్యక్షుడికి కాముని వనిత హెచ్‌పీవీ టీకా లక్ష్యం సకాలంలో పూర్తిచేయాలి - డీఎంహెచ్‌వో డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అర్హుల ఓటు హక్కుకు భంగం వద్దు - పరిశీలకులు బాలమయాదేవి

భద్రాద్రి రామాలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి*

Select Suryaa Now
భద్రాద్రి రామాలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి*

సూర్య, భద్రాచలం,భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.

బుధవారం భద్రాచలం పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ అంకిత్,భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణతో కలిసి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన రాతి కట్టడాల నిర్మాణ పనులకు మంత్రి పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలకు అనుగుణంగా భక్తుల ఆకాంక్షలకు మించి భద్రాచలం రామాలయాన్ని అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రాలను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోందని తెలిపారు. పుష్కరాల అభివృద్ధి పనుల కోసం వివిధ శాఖల ద్వారా ఇప్పటికే రూ.1,100 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.

భద్రాచలం రామాలయ అభివృద్ధికి సుమారు రూ.300 కోట్ల మేర నిధులు కేటాయించామని, అవసరమైన అదనపు నిధులు కూడా సమకూరుస్తామని తెలిపారు. ఆలయ రాతి కట్టడాలు భవిష్యత్ తరాలకు శాశ్వత ఆస్తిగా నిలిచేలా నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని సూచించారు. డిసెంబర్ 19న జరగనున్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆలయ అభివృద్ధి పనులు, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పనులకు అవసరమైన కార్మికుల సంఖ్యను తక్షణమే పెంచి కనీసం 300 మందితో పనులు కొనసాగించాలని ఆదేశించారు. సెంట్రింగ్, స్టీల్, రాడ్ బెండింగ్ పనులకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవాలని, ఇంజనీరింగ్ సిబ్బంది కొరతను వెంటనే పరిష్కరించాలని సూచించారు.

పెండింగ్‌లో ఉన్న డ్రాయింగ్‌లు, డిజైన్లను వెంటనే పూర్తి చేయాలని, రాతి నిర్మాణాలకు అవసరమైన సామగ్రిని ముందుగానే సమకూర్చుకోవాలని తెలిపారు. పనుల అమలులో జాప్యానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఉత్తర, దక్షిణ పుష్కర ఘాట్ల నిర్మాణాలకు సంబంధించిన డ్రాయింగ్‌లను త్వరితగతిన ఆమోదింపజేసి పనులు ప్రారంభించాలని, రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణ ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు.

కరకట్టల నిర్మాణ ప్రతిపాదనలు రూపొందించేటప్పుడు రైతులకు, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రజాప్రతినిధులతో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ముక్కోటి ఏకాదశి నాటికి భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని, తాత్కాలిక ఏర్పాట్లకు పరిమితం కాకుండా భవిష్యత్తులోనూ ఉపయోగపడే శాశ్వత సదుపాయాలను అభివృద్ధి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

అనంతరం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భద్రాచలం నూతన మార్కెట్‌లో రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న గిరిజన బహుళ ప్రయోజన మార్కెట్ కేంద్రం నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

అదేవిధంగా రంగనాయకుల గుట్ట వద్ద రూ.5.45 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా భూస్థాయి నీటి నిల్వ ట్యాంకు (జీఎల్ఎస్ఆర్) నిర్మాణం, బోర్‌వెల్స్, పంపుసెట్లు, పైప్‌లైన్ల ఏర్పాటు, భద్రాచలం ఘాట్ వద్ద శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూనెం కృష్ణ,ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ , సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ,దేవస్థానం ఈఓ దామోదర్ రావు సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సూర్య ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ