బాల్యవివాహాల నిర్మూలనకు విద్యార్థుల గళం!
చిన్నకోడూరు;బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని చంద్లాపూర్ గ్రామ సర్పంచ్ సురగోని శేఖర్ గౌడ్ పిలుపునిచ్చారు. బాలికలకు బాల్యాన్ని దూరం చేయకుండా,విద్యతో ఉన్నత శిఖరాలకు చేర్చాలని సూచించారు.అంతర్జాతీయ బాల్య, ముందస్తు,బలవంతపు వివాహాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలో ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి ఆధ్వర్యంలో విద్యార్థులకు బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా అవగాహన ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రమేష్, మౌనిక మాట్లాడుతూ.. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారని తెలిపారు. చిన్న వయస్సులో వివాహాలు చేయడం వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, మానసిక వికాసం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. తల్లిదండ్రులు బాలికలకు చిన్న వయస్సులో వివాహాలు చేయకుండా, ఉన్నత విద్యను అందించి స్వతంత్రంగా ఎదిగేందుకు ప్రోత్సహించాలని కోరారు. బాల్యవివాహాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, బాలల హక్కులను పరిరక్షిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.