telangana
అనారోగ్యంతో మృతి చెందిన గల్ఫ్ కార్మికుని భార్య - కుటుంబానికి అండగా నిలిచిన గల్ఫ్ అసోసియేషన్
సూర్య, జన్నారం : జన్నారం మండలం రాంపూర్ గ్రామంలో తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాంపూర్ కమిటీ ఆధ్వర్యంలో గల్ఫ్ కమిటీ సభ్యుడైన సుంకరి రాజన్న భార్య లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆ కుటుంబానికి ఎదురైన ఈ కష్ట సమయంలో వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో గల్ఫ్ కమిటీ సభ్యులు ముందుకు వచ్చి 14,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గల్ఫ్ కార్మికుల కమిటీ మరోసారి తన సేవాభావాన్ని చాటుకుంది. కుటుంబంలోని వ్యక్తిని కోల్పోయిన బాధను ఎవరూ తీర్చలేరని, ఇలాంటి కష్టకాలంలో కుటుంబానికి కొంత ఆర్థిక తోడ్పాటు అందించడం ద్వారా మనోధైర్యాన్ని కల్పించవచ్చని, సంకరి రాజన్న కుటుంబానికి అందించిన ఈ ఆర్థిక సహాయం కేవలం డబ్బు మాత్రమే కాకుండా, బాధలో ఉన్న కుటుంబానికి సంఘం అండగా ఉందనే భరోసా, ఆత్మీయతకు నిదర్శనమని గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు కల్లెడ భూమయ్య తెలిపారు. తోటి సభ్యుడి కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావించి ఈ సహాయం అందించినట్లు, గల్ఫ్ కార్మికులు విదేశాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం, బాధిత కుటుంబాలకు భరోసా కల్పించడం, సభ్యుల మధ్య ఐక్యత మరియు పరస్పర సహకారాన్ని పెంపొందించడం వంటి లక్ష్యాలతో కమిటీ ముందుకు సాగుతోందని గ్రామ అధ్యక్షుడు లింగాల వెంకటేష్ మరియు రాష్ట్ర కన్వీనర్ సంద సుదర్శన్ లు అన్నారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కల్లెడ లచ్చయ్య, ఓరగంటి వెంకటేష్, రేసవేణి లచ్చన్న, వేముల సత్తయ్య, గ్రామ పెద్దలు సంధినేని శ్రీనివాస్, మల్లేష్ లు పాల్గొన్నారు.