తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం బతుకమ్మ సంబురాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులు, సిబ్బంది ప్రకృతి సిద్ధమైన రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ వేడుకలను ప్రారంభించారు. అనంతరం మహిళా అధికారులు, ఉద్యోగులతో కలిసి బతుకమ్మ పాటలకు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. మహిళలందరికీ పూల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వేడుకల్లో భాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేశారు. ఇందులో ప్రథమ బహుమతి వ్యవసాయ శాఖకు, ద్వితీయ బహుమతి రెవెన్యూ శాఖకు, తృతీయ బహుమతి తంగళ్లపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు లభించింది. విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేసి అభినందించారు.
- ఆదివారం సిరిసిల్లలో సద్దుల బతుకమ్మ
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ బతుకమ్మ, విజయదశమి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులంతా ఎంతో ఉత్సాహంగా బతుకమ్మలను అందంగా పేర్చి సంబురాల్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. వేములవాడలో శుక్రవారమే సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా ముగిశాయని, ఆదివారం సిరిసిల్లలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, వేములవాడ రెవెన్యూ డివిజనల్ అధికారి కే ఎస్ బీ కుమారి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, వివిధ శాఖల జిల్లా అధికారులు అఫ్జల్ బేగం, సౌజన్య, ఏంజెలా ఆల్ఫ్రెడ్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.