టెక్కలిలో వైసీపీకి ఎదురుదెబ్బ
.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న 200 కుటుంబాలు
కోటబొమ్మాళి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టెక్కలి నియోజకవర్గంలో గత నెల రోజుల నుంచి వైకాపాకు దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే వున్నాయి. దీనిలో భాగంగా టెక్కలి పట్టణంలోని గొల్లవీధికి చెందిన సుమారు 200 కుటుంబాలు నాగళ్ళ శంకరరావు, నాగళ్ళ మోహినీ తదితరుల ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో మరోసారి వైకాపకు ఎదురుదెబ్బ తగిలింది.
నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో వీరు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై పలు సూచనలు చేశారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు నాయకులు, కార్యకర్తలకు సూచించారు. రాజకీయాల్లో ప్రజల ఆదరణ, విశ్వాసం ఎంతో ముఖ్యమని, ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం పనిచేయాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలోకి కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, స్థానిక సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని తెలిపారు.