చినబాడంలో ఎన్నికల భద్రతపై పోలీసుల అవగాహన సదస్సు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు సహకరించాలని డీఎస్పీ పిలుపు.
పలాస, అక్టోబర్ 17, మేజర్ న్యూస్.
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా శనివారం పురపాలక సంఘ పరిధి చినబాడం గ్రామంలో కాశీబుగ్గ డీఎస్పీ జీ.వీ.రమణ, సీఐ ఆధ్వర్యంలో గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
ఎన్నికల నియమాలు పాటించాలి..
ఈ సందర్భంగా డీఎస్పీ రమణ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ఎన్నికల సమయంలో గొడవలు, ఘర్షణలకు దూరంగా ఉండాలి.ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.అక్రమ మద్యం, నగదు పంపిణీపై ప్రత్యేక నిఘా ఉందని,పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.గ్రామంలో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు,రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని,అలాంటి వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రజలంతా భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది,గ్రామ పెద్దలు,యువత పాల్గొన్నారు.