స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం
ఎమ్మెల్యే మామిడి గోవిందరావు....
మెలియాపుట్టిరానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు (ఎంజీఆర్) పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ఎన్నికలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు. శనివారం పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మెలియాపుట్టి, హిరమండలం మండలాలకు చెందిన నాయకులు, ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయా మండలాల్లో పార్టీ పరిస్థితి, స్థానిక ఎన్నికలకు సన్నద్ధత, ఎంపీపీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై నాయకులతో విస్తృతంగా చర్చించారు. ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న ఆశావహుల పేర్లను స్వీకరించారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. అధిష్ఠానం ఎవరికి అవకాశం కల్పించినా, వారిని గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.ఎన్నికల్లో వ్యక్తిగత అభిప్రాయాలు, భేదాభిప్రాయాలకు తావివ్వకుండా పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రజలతో నిరంతరం మమేకమవుతూ, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా నాయకులు వ్యవహరించాలని అన్నారు.
మెలియాపుట్టి, హిరమండలం మండలాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు, రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తే ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించవచ్చని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో పీఏసీఎస్ అధ్యక్షులు, ఏఎంసీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర డైరెక్టర్లు,
నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.