తెలంగాణ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్: 20,003 మెగావాట్లకు చేరిన విద్యుత్ డిమాండ్,,:పొదుపుగా వాడాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ విజ్ఞప్తి
సూర్య ప్రాంతీయ డెస్క్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదై సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో వ్యవసాయం, గృహావసరాలు, వాణిజ్య సంస్థలు, ఐటీ మరియు భారీ పారిశ్రామిక రంగాల నుంచి కరెంట్ వినియోగం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15న ఉదయం 10 గంటల 29 నిమిషాలకు రాష్ట్రవ్యాప్త గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏకంగా 20,003 మెగావాట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో నమోదైన 18,548 మెగావాట్లతో పోలిస్తే ఇది 1,455 మెగావాట్లు అధికం కావడం విశేషం. అదే రోజున రాష్ట్రవ్యాప్త రోజువారీ విద్యుత్ వినియోగం 334.54 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. అక్టోబర్ 1 నుండి 15వ తేదీ వరకు రాష్ట్ర సగటు గరిష్ట డిమాండ్ 19,289 మెగావాట్లుగా, సగటు రోజువారీ విద్యుత్ వినియోగం 321.34 మిలియన్ యూనిట్లుగా నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.
దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోనూ విద్యుత్ వినియోగం సరికొత్త గరిష్టాలను నమోదు చేసింది. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో అక్టోబర్ 15న 12,281 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదవగా, రోజువారీ విద్యుత్ వినియోగం 228.14 మిలియన్ యూనిట్లకు చేరింది. గత ఏడాది నమోదైన గరిష్ట రోజువారీ వినియోగం 222.34 మిలియన్ యూనిట్లతో పోలిస్తే ఇది 5.80 మిలియన్ యూనిట్లు ఎక్కువ. ఇక టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో సెప్టెంబర్ 30న సాయంత్రం 4 గంటల 16 నిమిషాలకు ఏకంగా 12,299 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం గరిష్ట డిమాండ్ 11,318 మెగావాట్లతో పోలిస్తే ఈ పెరుగుదల సంస్థ నిర్వహణ సామర్థ్యానికి అద్దం పడుతోంది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ అంతరాయాలు లేకుండా సంస్థ చర్యలు చేపట్టింది.
హైదరాబాద్ మహానగరంలోనూ విద్యుత్ అవసరాలు గణనీయంగా పెరిగాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అక్టోబర్ 15న సాయంత్రం 6 గంటల 19 నిమిషాలకు 4,220 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది. అలాగే అక్టోబర్ 9న నగరంలో రోజువారీ విద్యుత్ వినియోగం 88.22 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదైన గరిష్ట డిమాండ్ 3,552 మెగావాట్లతో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. నగరంలో వాణిజ్య కార్యకలాపాలు, ఐటీ కంపెనీల అవసరాలతో పాటు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కారణంగా ఏసీలు, శీతలీకరణ యంత్రాల వినియోగం విపరీతంగా పెరగడం ఈ డిమాండ్‌కు ప్రధాన కారణంగా నిలిచింది.
ఈ సందర్భంగా టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని రంగాల విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సరఫరా వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భూగర్భ జలమట్టాలు తగ్గుతున్న పరిస్థితుల్లో రైతులు వ్యవసాయ బోర్లపై ఆధారపడటం, మోటార్ల వినియోగం పెరగడం వల్ల గ్రిడ్‌పై అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు. పెరుగుతున్న అవసరాలకు తగినట్లు విద్యుత్ కొనుగోళ్లు, ఉత్పత్తి సామర్థ్యాల పెంపు వంటి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు రైతులు, ప్రజలు విద్యుత్‌తో పాటు నీటిని కూడా పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. అవసరం లేనప్పుడు విద్యుత్ ఉపకరణాలను ఆపివేయడం ద్వారా డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించవచ్చని సూచించారు.
రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు అధికారులతో కూడిన బృందాలు గత వారం రోజులుగా ప్రతిరోజూ ఉదయం పొలం బాట కార్యక్రమంలో గ్రామాల్లో పర్యటిస్తున్నాయని సీఎండీ వెల్లడించారు. విద్యుత్ సరఫరాతో పాటు భూగర్భ జలాలు, బోర్లలో నీటి లభ్యత, మోటార్ల పనితీరు, పంటల స్థితిగతులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. తక్కువ వోల్టేజీ, ట్రాన్స్ఫార్మర్ల సమస్యలు, సర్వీస్ వైర్ల లోపాలను క్షేత్రస్థాయిలోనే తక్షణమే పరిష్కరిస్తూ సాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా చూస్తున్నారు. రికార్డు స్థాయి డిమాండ్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తూ నిరంతర నాణ్యమైన కరెంట్ సరఫరా అందిస్తున్న ఇంజనీర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావాన్ని ఈ సందర్భంగా సీఎండీ ప్రత్యేకంగా అభినందించారు.