పినపాకలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
పినపాకలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
మణుగూరు ఆర్ సి సూర్య(మేజర్ న్యూస్); పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమం, ఆహార భద్రతకు పెద్దపీట వేస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు అన్నారు.శనివారం పినపాక మండల రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్గదర్శకత్వంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ సేవలను మరింత సులభతరం చేయడంతో పాటు పారదర్శకంగా రేషన్ సరుకులు అందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. పేద కుటుంబాలకు రేషన్ కార్డులు ఆహార భద్రతకు ముఖ్యమైన ఆధారమని, ప్రభుత్వ నిబంధనలు, అర్హతలను బట్టి వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు కూడా ఉపయోగపడతాయని వివరించారు.