యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి
నగరం, మేజర్ న్యూస్:
యువత మాదకద్రవ్యాలు, మద్యం, ధూమపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సిఫార్డ్ సంస్థ కార్యదర్శి కె. రవి ప్రదీప్ పిలుపు నిచ్చారు. శనివారం స్థానిక సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ (సిఫార్డ్) సంస్థ ఆధ్వర్యంలో నగరంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని గుంటూరు మేరా యువ భారత్ నేతృత్వంలో యోగా, మెడిటేషన్ ఫర్ నషా ముక్త్ యువ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ మత్తు రహిత యువతతోనే ఆరోగ్యవంతమైన సమాజం, అభివృద్ధి చెందిన భారతదేశం సాధ్యమవుతుందన్నారు. యువతకు యోగా, ధ్యానం ప్రాధాన్యంతోపాటు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, శరీరం, మనస్సు మధ్య సమతుల్యతను పెంపొందించే జీవన విధానమని పేర్కొన్నారు. నేటి యువతను పెడదారి పట్టిస్తున్న మాదకద్రవ్యాలు, మద్యపానం, పొగాకు, ఈ-సిగరెట్లు, జూదం వంటి వ్యసనాలు వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబ వ్యవస్థకు, సమాజాభివృద్ధికి తీవ్ర ఆటంకంగా మారుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా యువత తమ శక్తిసామర్థ్యాలను విద్య, ఉపాధి, క్రీడలు, సామాజిక సేవ, దేశాభివృద్ధి కోసం వినియోగించాలని సూచించారు. వ్యసన రహిత సమాజ నిర్మాణంలో యువత కీలకపాత్ర పోషించాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఇతరులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్లు రామకృష్ణ, సల్మా, జ్యోతి, కమ్యూనిటీ మొబిలైజర్ కె. నాగేశ్వరరావు, ఇన్స్ట్రక్టర్లు సరిత, దేవకరుణ, ఇంచార్జ్ దేవదానం, గ్రామస్తులు పాల్గొన్నారు.