రీ-సర్వే ప్రక్రియలో ఖచ్చితత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి * అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య
కోడేరు, సూర్య న్యూస్: మండల పరిధిలోని బావాయిపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే పనులను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వే ప్రక్రియలో చేపడుతున్న చర్యలు, ఇప్పటివరకు పూర్తయిన పనులు, మిగిలి ఉన్న పనుల వివరాలపై ఆరా తీశారు.
భూముల రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. సర్వే పనుల్లో ఖచ్చితత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని, నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. రీ-సర్వే ద్వారా భూములకు సంబంధించిన వివరాలు స్పష్టంగా నమోదు అయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రజలకు భూములకు సంబంధించిన వివరాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, రీ-సర్వే పనులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
అదనపు కలెక్టర్ వెంట బావయ్య పల్లి గ్రామ సర్పంచ్ పరశురాముడు సంబంధిత రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది తదితరులు ఉన్నారు.