సైబర్ భద్రతపై ‘దాండియా’ అవగాహన.... సాంస్కృతిక వేడుకల్లో సైబర్ నేరాలపై చైతన్యం
గచ్చిబౌలి,మేజర్ న్యూస్ : సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు పోలీస్–ప్రజల సంబంధాలను బలోపేతం చేసేందుకు సైబరాబాద్ పోలీసులు ‘సైబర్ దాండియా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ నాయకత్వంలో, ఎస్సీఎస్సీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయంతో జరిగిన ఈ వేడుకల్లో సుమారు 1,500 మంది పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సీపీ రమేష్ మాట్లాడుతూ.. డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాలు, ఫిషింగ్, ఓటీపీ మోసాలు, నకిలీ లింకులు, పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీలు, పాస్వర్డ్లు, బ్యాంకు వివరాలను ఇతరులతో పంచుకోవద్దన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేయాలని తెలిపారు
.డీసీపీ పుష్ప మాట్లాడుతూ.. గుర్తుతెలియని కాల్స్, అనుమానాస్పద లింకులు, నకిలీ పెట్టుబడి పథకాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏఐ, డిజిటల్ సాధనాలు, వీడియోల ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. దాండియా ప్రదర్శనలతోపాటు భద్రతా సందేశాలను అందించారు. పోలీసు అధికారులు, ఐటీ ప్రతినిధులు, యువత, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.