సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
సూర్య ఆర్సీ ఇల్లందు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక సింగరేణి పాఠశాల ఆవరణలో సేవా సమితి సభ్యులు, ఉద్యోగుల కుటుంబాలకు చెందిన మహిళలకు బతుకమ్మ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ్య ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి సేవా అధ్యక్షురాలు వి. రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు రమ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, మహిళల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ప్రకృతిలో లభించే రంగురంగుల పూలను అందంగా పేర్చి బతుకమ్మలను రూపొందించడం ఈ పండుగ ప్రత్యేకత అని పేర్కొన్నారు. మహిళలు బతుకమ్మల చుట్టూ వలయాకారంలో తిరుగుతూ చప్పట్లు కొడుతూ సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడటం తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందన్నారు.
బొడ్డెమ్మతో ప్రారంభమై ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులపాటు కొనసాగే ఈ పండుగ ప్రకృతిని ఆరాధించే గొప్ప సంప్రదాయమని వివరించారు. బతుకమ్మ పాటలు తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని, ఆచార వ్యవహారాలను, సంస్కృతిని ప్రతిబింబిస్తాయని తెలిపారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ పండుగ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తోందని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా మహిళల్లో ఐక్యత, సాంస్కృతిక చైతన్యం పెంపొందుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతగా సేవా సెక్రటరీ సులక్షణ, సేవా సమితి సభ్యులు, ట్రైనర్స్ , పాఠశాల ఉపాధ్యాయులు, ఉద్యోగుల కుటుంబాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ రాజేష్ ఇల్లందు