రామాయంపేటలో ఆత్మీయ అలైబలై కార్యక్రమం
రామాయంపేట; రామాయంపేట మెహర్ సాయి ఫంక్షన్ హాల్ లో తెలంగాణ ఉద్యమకారులు, పునర్నిర్మాణ యోధుల ఆత్మీయ అలైబలై వేడుక శోభాయమానంగా మాజీ ఎంపీపీ గుండా ఎల్లం ప్రత్యేక చొరవతో ఈ ఆత్మీయ సమ్మేళనం, సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధపడిన యోధులంతా ఒకే వేదికపైకి రావడం విశేషం.దసరా పండుగ వేళ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఉద్యమ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఏళ్ల తరబడి కలిసి పోరాడిన సహచరులు ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పట్టణంలో మునుపెన్నడూ లేని విధంగా ఒక గొప్ప భావోద్వేగపూరిత, స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. ఉద్యమ తొలి, మలి దశల్లో పడిన కష్టాలను, సాధించిన విజయాలను నాయకులు ప్రసంగించారు.ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర కల నెరవేరేందుకు ప్రతి ఒక్కరూ చేసిన త్యాగా ఆనాడు సంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు బస్సులు మారుతూ పడిన ప్రయాణ ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు.రాత్రింబవళ్లు తేడా లేకుండా కంటిమీద కునుకు లేకుండా ఉద్యమ బాటలో నడిచిన రోజులను భావోద్వేగంతో నెమరువేసుకున్నారు.సకల జనుల సమ్మె ద్వారా రవాణా ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ నిలిపివేసి కేంద్రం మెడలు వంచిన తీరును కొనియాడారు.ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు ఏకమై పోరాడడం వల్లే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైందని స్పష్టం చేశారు.బతుకమ్మ సంబరాలు, మన సంస్కృతే ఆయుధంగా ఉద్యమాన్ని ప్రపంచ నలుమూలలకూ చాటామని పేర్కొన్నారు.ఉద్యమంలో వంద మంది పోరాడితే అందులో 90 మంది నష్టపోయారని కేవలం 10 మందికి మాత్రమే ఫలాలు దక్కాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.పదవులు వచ్చినా రాకపోయినా స్వరాష్ట్ర సాధనే తమ అందరి జీవిత ఆశయమని సభికులు ముక్తకంఠంతో చాటారు.ఇప్పుడు సాధించుకున్న తెలంగాణను బంగారు బాటలో నడిపించేందుకు అందరం పునర్నిర్మాణంలో భాగస్వాములం కావాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఉద్యమకారుల త్యాగాలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఉద్యోగికి, ఉద్యమకారునికి సముచిత న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఆనాడు అన్ని పార్టీలు కలిసి పోరాడినట్లే, నేడు కూడా అభివృద్ధి కోసం కలసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రమాశర్మ, నర్సింహా రెడ్డి, రామచంద్రన్ వేదికపై తమ అనుభవాలను పంచుకున్నారు.ప్రముఖ నాయకులు వసంత రెడ్డి, రామచంద్ర రెడ్డి, షాజలుద్దీన్ తదితరులు పాల్గొని ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు.సుదీర్ఘ కాలం తర్వాత పాత సహచరులను కలవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేశారు.ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్కచేయక పోరాడిన వీరులను పొన్నాడలతో శాలువాలతో సన్మానించారు.కష్ట సమయాల్లో అండగా నిలిచిన మిత్రులను గౌరవించుకోవడం తమ బాధ్యత అని నిర్వాహకులు తెలిపారు.ఇటువంటి ఆత్మీయ కలయికలు ఉద్యమకారులలో నూతన ఉత్సాహాన్ని ఐక్యతను నింపుతాయని అభిప్రాయపడ్డారు.భవిష్యత్తులో కూడా ఉద్యమకారుల సంక్షేమం కోసం ఉమ్మడిగా పోరాడాలని నాయకులు నిశ్చయించుకున్నారు.సమయాభావం ఉన్నప్పటికీ వేడుకలో పాల్గొని పాత జ్ఞాపకాలను పంచుకోవడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు.చివరగా ఉద్యమ వీరులందరూ ఏకమై జై తెలంగాణ నినాదాలతో రామాయంపేట వీధులను మార్మోగిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు ప్రజా ప్రతినిధులు వివిధ ప్రాంతాలకు చెందిన తెలంగాణ ఉద్యమ నాయకులు తదితరులు పాల్గొన్నారు.