మోదీ, అమిత్ షా, షిండేలను ఎక్కడా దేవుళ్లని అనలేదు.. నా దృష్టిలో వారు అభినవ రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు: శివసేన రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ స్పష్టత
సూర్య రాజకీయ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ తీవ్రంగా ఖండించారు. తాను ఎక్కడా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేలను దేవుళ్లని చెప్పలేదని, గుడి కట్టి పూజించమని అనలేదని ఆయన స్పష్టం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణకు, దేశ రక్షణకు తన ప్రాణాలను సైతం అర్పించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తేల్చిచెప్పారు.
దేశ సేవలో నిరంతరం శ్రమిస్తున్న నాయకులకే తన గౌరవం:
అక్టోబర్ 7న ప్రధాని మోదీ ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి వరకు నిరంతరాయంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శివసేన పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. విపక్షాలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా లెక్కచేయకుండా భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రధాని మోదీ 24 గంటలు శ్రమిస్తున్నారని కొనియాడారు. కష్టకాలంలో సహాయం చేసిన వారిని దేవుడితో సమానంగా చూసే సంప్రదాయం మనదని, అదే భావనతో దేశాన్ని కాపాడుతున్న నేతలను గౌరవించానని పేర్కొన్నారు.
అభినవ రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడిగా అభివర్ణన:
తన దృష్టిలో ప్రధాని నరేంద్ర మోదీ కలియుగంలో దేశాన్ని రక్షిస్తున్న అభినవ రాముడని, గత 50 ఏళ్లుగా మోదీకి అండగా నిలబడిన అమిత్ షా అభినవ లక్ష్మణుడని సింకారు శివాజీ పేర్కొన్నారు. అలాగే బాలాసాహెబ్ ఆశయాలను విస్మరించి సిద్ధాంత విరోధులతో చేతులు కలిపిన వారి నుంచి శివసైనికులకు ధైర్యం చెప్పి ధర్మం వైపు నడిపించిన ఏక్ నాథ్ షిండే తనకు అభినవ హనుమంతుడిగా కనిపించారని వివరించారు. హిందూ సనాతన ధర్మంలో గురువును త్రిమూర్తులతో సమానంగా భావిస్తామని, దేశాన్ని నడిపిస్తున్న ఈ నాయకులు తనకు గురువుల్లా కనిపించారని, ఇందులో దేవుళ్లను అవమానించడం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు.
విమర్శలు మాని సనాతన ధర్మ రక్షణపై దృష్టి పెట్టండి:
తాను గత 18 ఏళ్లుగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతున్నానని శివసేన రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టం చేశారు. తనపై అనవసర రాద్ధాంతం చేస్తున్న సెక్యులర్ హిందువులు, ముందుగా సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని, హిందూ దేవుళ్లపై వక్రబుద్ధితో వ్యవహరిస్తున్న అరాచక శక్తులను నాశనం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనవసర విమర్శలు మానుకుని అధర్మంపై యుద్ధం చేయాలని ఆయన హితవు పలికారు.