సర్పంచ్ లావణ్య మోహన్ ఆధ్వర్యంలో దుర్గం చెరువులో ఘనంగా బతుకమ్మ సంబరాలు
మోమిన్పేట్, మేజర్ న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రతి ఆడబిడ్డ ఆత్మగౌరవానికి ప్రతీక అని దుర్గం చెరువు సర్పంచ్ లావణ్య మోహన్ అన్నారు. ఆదివారం మోమిన్పేట్ మండల పరిధిలోని దుర్గం చెరువు గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, మహిళలు కలిసి గౌరీ పూజ నిర్వహించి బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ పాటలు ఆలపిస్తూ మహిళలు కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. రామ రామ రామ ఉయ్యాలో’ అంటూ పాటలు పాడుతూ గ్రామంలోని వీధులన్నీ సందడిగా మార్చారు. అనంతరం హనుమాన్ మందిరం వద్ద బతుకమ్మలను కొలువుదీర్చి వేడుకలు నిర్వహించి, సమీపంలోని బావులు, చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సరియాబీ, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్: వడ్ల మాణిక్యం చారి, మోమిన్ పేట్, వికారాబాద్ జిల్లా.