వైభవంగా 'సద్దుల బతుకమ్మ - మానకొండూరు మండలంలో కోలాహలంగా వేడుకలు
సూర్య - మానకొండూర్ : తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు, విశిష్ట జీవన శైలికి ప్రతీకగా నిలిచే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ ముగింపు ఘట్టమైన 'సద్దుల బతుకమ్మ' వేడుకలను మానకొండూరు మండల వ్యాప్తంగా వర్ణశోభితంగా, అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రకృతిని దైవంగా భావించి పూజించే ఈ సుమాంబర వేడుకల్లో భాగంగా, తొమ్మిది రోజుల పాటు పూల పరిమళాలతో పులకించిన పల్లెలు ఆదివారం నాటి సద్దుల బతుకమ్మతో పండగ శోభను సంతరించుకున్నాయి. ఉపాధి, చదువుల కోసం పట్టణాలకు వెళ్లిన ఆడపడుచులు స్వగ్రామాలకు చేరుకోవడంతో ప్రతి ఇల్లూ, పల్లె మురిసిపోయింది.మహిళలు ఉదయాన్నే తంగేడు, గునుగు, తామర, బంతి, చామంతి వంటి తీరొక్క పూలను సేకరించి, ఆకర్షణీయమైన రంగులు అద్ది వెంకటేశ్వర స్వామి గోపురం ఆకారంలో బతుకమ్మలను పేర్చారు. బతుకమ్మల శీర్షభాగంలో పసుపుతో గౌరమ్మను నిలిపి, పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళల్లో గ్రామాలలోని ప్రధాన కూడలులకు బతుకమ్మలతో చేరుకున్న మహిళలు, బాలికలు ఒకేచోట చేరి బతుకమ్మను నిలిపారు. "ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ" అంటూ లయబద్ధమైన చప్పట్లు, పాటలతో, కోలాటాలతో అలరించారు.ప్రత్యేక ఆకర్షణగా 'అన్నారం' వేడుకలు: మండలంలోని అన్నారం గ్రామంలో బతుకమ్మ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామానికి చెందిన మైదానంలో వేలాది మంది మహిళలు ఒకేచోట చేరి బతుకమ్మ ఆడడం ప్రతి ఏటా ఇక్కడ కనిపించే ప్రత్యేకత. మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచులు, ప్రజాప్రతినిధులు ముందస్తుగా మౌలిక వసతులు కల్పించారు. ప్రధాన వీధుల్లో ఎల్ఈడీ వెలుగులు, తాగునీరు, డీజే, మైక్ సిస్టమ్తో శబ్ద యంత్రాలను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూశారు.మానకొండూరు మండల కేంద్రంలోని తూర్పు దర్వాజా వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అంటే కేవలం పూల పండుగ మాత్రమే కాదు, అది ప్రకృతితో, పర్యావరణంతో మమేకమైన మన గొప్ప సాంస్కృతిక వారసత్వం అన్నారు. తొమ్మిది రోజుల పాటు ప్రకృతి సిద్ధమైన పూలను పూజించి, నీటిలో నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు జలవనరుల విశిష్టత పెరుగుతుందన్నారు. ఆడపడుచులందరూ ఆయురారోగ్యాలతో, సంతోషాలతో వర్ధిల్లాలని గౌరమ్మ తల్లిని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.
అనంతరం వేడుకల ముగింపుగా బతుకమ్మలను చెరువులు, కాలువల్లో సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేసి, మహిళలు ఒకరికొకరు వాయనాలు (సద్దులు) మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.