సర్పంచ్ బండ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో టేకులపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
మోమిన్పేట్, మేజర్ న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రతి ఆడబిడ్డ ఆత్మగౌరవానికి ప్రతీక అని టేకులపల్లి సర్పంచ్ బండ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం మోమిన్పేట్ మండల పరిధిలోని టేకులపల్లి గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, మహిళలు కలిసి సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ పాటలు ఆలపిస్తూ మహిళలు కోలాటాలు ఆడుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. రామ రామ రామ ఉయ్యాలో’ అంటూ మహిళలు ఆలపించిన పాటలతో గ్రామంలో పండుగ సందడి నెలకొంది. గ్రామంలోని వివిధ వీధుల నుంచి బతుకమ్మలతో బయలుదేరిన మహిళలు హనుమాన్, శివాలయం వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం బతుకమ్మలను గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మహమ్మద్ అస్లాం, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్: వడ్ల మాణిక్యం చారి, మోమిన్ పేట్, వికారాబాద్ జిల్లా.