ప్రణాళికలు లేని ప్రభుత్వం ఇది... మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
కాంగ్రెస్ పాలనలో అన్నదాతల ఆక్రందన
షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆగ్రహం
• ముందే హెచ్చరించిన కేసీఆర్.. నేడు నిజమైంది
• ఎల్ నినో ప్రభావంతో ఎండిపోతున్న పంటలు..
• ఎకరాకు ₹50 వేల పరిహారం ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం
షాద్ నగర్:
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, ప్రభుత్వ ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే నేడు అన్నదాతలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం షాద్నగర్ పట్టణంలోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలోనే కేసీఆర్ ప్రచారం చేస్తూ.. "కాంగ్రెస్కు ఓటేసి మోసపోతే తర్వాత ఘోషపడాల్సి వస్తుంది" అని చెప్పిన మాటలు నేడు అక్షరాలా నిజమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోతుంటే, ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా తమాషా చూస్తోందని మండిపడ్డారు. పంటలు చేతికి రాక రైతులు అల్లాడుతుంటే, రాబోయే పండుగలను వారు ఎలా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
కేసీఆర్ పాలనలోనే రైతుకు రక్షణ
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు సాగునీరు, విద్యుత్కు ఎప్పుడూ కొరత రాలేదని ఆయన గుర్తుచేశారు. రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువుల పంపిణీ చేయడంతో పాటు అతివృష్టి, అనావృష్టి సమయాల్లో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ వ్యవసాయాన్ని పండుగలా మార్చారని కొనియాడారు. 24 గంటల ఉచిత విద్యుత్ అందించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ రాజీ పడలేదని స్పష్టం చేశారు.
*కాంగ్రెస్ వైఫల్యాలపై ధ్వజం*
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ నినో ముప్పు పొంచి ఉందని తెలిసి కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని అంజయ్య యాదవ్ విమర్శించారు. శ్రీశైలం, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా నీటిని నిల్వ చేసి రైతులకు అందించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కనీసం పంటలు పండేందుకు మరో 20 నుండి 25 రోజుల పాటు పూర్తిస్థాయిలో విద్యుత్ అందించి ఉంటే మొక్కజొన్న, వరి పంటలు కాపాడుకునేవారమని, కరెంట్ కోతల వల్ల పంటలన్నీ ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సంక్షోభానికి కారణాలపై ప్రశ్నిస్తూ.. హైడ్రో పవర్ లేనప్పుడు థర్మల్ పవర్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ఎందుకు పెంచలేదని నిలదీశారు. ఇదే సమయంలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయం వెనుక కాంగ్రెస్ అవినీతి దాగి ఉందన్నారు.
*తక్షణ డిమాండ్లు*
రాష్ట్రంలో పంట నష్టంపై ప్రభుత్వం తక్షణమే సర్వే నిర్వహించాలని, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు ₹50,000 చొప్పున పరిహారం చెల్లించాలని అంజయ్య యాదవ్ డిమాండ్ చేశారు. అలాగే పంటలను కాపాడుకోవడానికి వీలుగా కనీసం రాబోయే 20 రోజుల పాటు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటిస్తామని, ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నారాయణరెడ్డి, ఈట గణేష్, రాజా వరప్రసాద్, లక్ష్మణ్ నాయక్, శ్రీధర్ రెడ్డి, బిశ్వ రామకృష్ణ, జూపల్లి శంకర్, రవి యాదవ్ , గోపి తదితరులు పాల్గొన్నారు.
జవాజి రాఘవేందర్ గౌడ్, మేజర్ న్యూస్